ఈ నెల 22నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సభలకు మాజీసీఎం జగన్ వస్తారా లేదా అనే అనుమానాలు రేగాయి. తనకు ప్రతిపక్ష హైద కూడా లేని సభకు రాలేనని ఆయన ఇంతకుముందు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సభకు వెళ్లడంపై అనేక ఊహాగానాలు నడిచాయి. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం వరకు సభలో ఉండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అటు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు ఇటీవల వెలుగుచూశాయి. దీనిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో అత్యంత దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపేశారు. దీంతో వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్ తన భవిష్య కార్యాచరణపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు వెల్లడించిన ఆయన తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని వెళ్లి నిరసన చేపడతామని తెలిపారు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధిస్తే విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొనగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ సమావేశానికి హజరైన జగన్… ప్రమాణం పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు కూడా తొలిరోజు సమావేశాలకు హాజరై రెండోరోజు బాయ్ కాట్ చేయనున్నారు. దీనిపై ఏపీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.