ఒక్కడై కదులుతున్న జగన్‌ – పట్టు కోల్పోతున్న చంద్రబాబు

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగు తేదీ సమీపిస్తోంది. మరో ఆరు రోజుల్లో ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నేటి నుంచి 32వ రోజు మే 13న పోలింగు జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగు తేదీ సమీపిస్తుండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా రోడ్‌షోలు, సభలతో పార్టీల అధినేతలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో ప్రతి రోజూ బస్సు యాత్ర, సభలు, ప్రజలతో ముఖాముఖి చేపడుతున్నారు. కూటమిగా జట్టు కట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాగళం పేరిట సభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర చేపడుతున్నారు. బీజేపీ కూడా తనవంతు ప్రచారం చేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో ఓవైపు భానుడి భగభగలతోపాటు.. ఎన్నికల వేడీ సెగ పుట్టిస్తోంది.

ఏపీలో జగన్‌ను ఓడించటం ఒక్కటే లక్ష్యంగా.. జెండాలు వేరైనప్పటికీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీలు కలసికట్టుగా పోటీచేస్తున్నాయి. తమ సమైక్యత గురించి పదేపదే సభల్లో ఊదరగొడుతున్నారు. అయితే నిజంగానే ఈ మూడు పార్టీలు కలిసే పోటీచేస్తున్నాయా? లేదా, తాము కలసి ఉన్నట్టుగా ప్రజలను భ్రమ పెడుతున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి రెండు రోజుల పాటు చంద్రబాబునాయుడు సభలు నిర్వహిస్తే.. బీజేపీ సారథి పురందేశ్వరి ఒక్కరోజే వారితో కలిసి పాల్గొన్నారు. బహుశా అది కూడా ఆమె స్వయంగా ఎంపీగా పోటీచేస్తున్న నియోజకవర్గం కాబట్టి. భారతీయ జనతా పార్టీ అంటేనే జాతీయ నాయకులని అర్థం.

మరి ఏపీలోని ఎన్డీయే ప్రచారపర్వంలో ఇప్పటి దాకా బీజేపీ జాతీయ నేతలు కనిపించడం లేదు. ఇదే కొనసాగితే చంద్రబాబుకు డ్యామేజీ తప్పదు. మూడు పార్టీలు కలసి పోటీ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. ఒక్క సభ మాత్రం చాలా భారీస్థాయిలో నిర్వహించారు. ఆ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. కానీ ఆయన ఎక్కడా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండానే.. బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇవ్వండి అనే ఒక్క మాట మాత్రమే తెలుగు ప్రజలకు చెబుతూ తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత.. బీజేపీ జాతీయ నాయకులు ఏపీ ఊసు ఎత్తడం లేదు. చంద్రబాబు మాత్రం.. ప్రచారానికి జాతీయ నాయకులు చాలా మంది వస్తారు.. అంటున్నారు. ఒకవైపు ప్రచారం ఇప్పటికే చాలా చోట్ల పూర్తి చేసేస్తున్నారు. జాతీయ నాయకులు కూటమి ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొనకుంటే.. దాని వల్ల కమలం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి.

జనసేన ఒక్క సీటు గెలుచుకోలేకపోయినా, కమిటీ అనేది లేకపోయినా కేవలం పవన్‌.. మనోహర్‌, నాగబాబులు ముగ్గురు మాత్రమే కీలక బాధ్యులుగా ఉండి పార్టీని నడుపుకుంటూ వచ్చారు. 2024 ఎన్నికలు ఓ సవాలు. ఈ సమయంలో జనసేన పూర్తిగా యాంటీ జగన్‌, యాంటీ వైసీపీగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై కూర్చోపెట్టడానికి సిద్ధమైపోయింది. ఎవరు ఏమనుకున్నా చంద్రబాబుకు అధికారం సాధించి పెట్టడమే తన ఎజెండా అనే విధంగా పవన్‌ వ్యవహరిస్తున్నారు. నలభై చోట్ల పోటీ చేస్తారేమో అనుకుంటే అందులో సగం చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నారు.

ఆ సగంలో కూడా సగం మంది తెలుగుదేశం దారికే టికెట్‌ లు ఇచ్చారు. 175 స్ధానాలకు పట్టుమని పాతిక చోట్ల కూడా పోటీ చేయడం లేదు జనసేన. 150 స్ధానాల్లో సరైన కమిటీలు లేవు. నియంత్రణ లేదు. ఇక్కడ అంతా ఓటు బదిలీ జరిగితేనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది. అది జరగాలి అంటే తెలుగుదేశం జనాలు అక్కడ జనసేన జనాలను దగ్గరకు తీయాలి. కానీ పైన నాయకులు కలిసిపోయినంత మాత్రాన ఇక్కడ లోకల్‌ లీడర్లు కలవడం అంత సులువు కాదు. అసలు జనసేన తమకు అవసరం లేదు అనే విధంగా టీడీపీ వారు ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు చాలా తెలివిగా జనసేన కార్యకర్తల బలాన్ని వాడుకుంటున్నారు.

ఇక్కడే వైసీపీ తెలివిగా పావులు కదుపుతోంది. ఎక్కడ జనసేన లేదో అక్కడే ఆ పార్టీ లోకల్‌ లీడర్లను తమ పార్టీలోకి లాగేస్తోంది. ప్రతి చోటా ఇప్పుడు అదే కార్యక్రమం జరుగుతోంది. జనసేన పోటీ చేయని చోట అంతా లోకల్‌ లీడర్లు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. బీజేపీ అంటే సంప్రదాయంగా అభిమానించే ఓటర్లు ఉన్నారు. కానీ అన్ని చోట్లా ఆ పార్టీకి ఓట్లు పడటం లేదు. లోకల్‌ కేడర్‌ లేకపోవడం ఇందుకు కారణం. జనసేనదీ ఇప్పుడు అదే పరిస్థితి.

ఇప్పటి వరకు జనసేన వ్యవహారాలు చూసిన నాదెండ్ల మనోహర్‌ తన సొంత నియోజకవర్గంలో తాను గెలవడం మీదే దృష్టి పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ తను పోటీ చేస్తున్న పిఠాపురం, అలాగే తమ పార్టీ పోటీ చేస్తున్న స్ధానాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. నిజానికి గత అయిదేళ్లుగా పార్టీని బలంగా చేసి ఉంటే.. ఇప్పుడు కొంత మంది జారిపోయినా, ఇబ్బంది ఉండేది కాదు. అలా చేయలేదు. ఇప్పుడు ఓట్ల బదిలీ జరిగేది కేవలం హార్డ్‌ కోర్‌ యాంటీ జగన్‌ అనే వాళ్లు జనసేనలో ఉంటేనే.. అలాంటి వారి శాతం ఎంత ఉంటుంది? 2019లో జనసేన ఓట్లు చాలా వరకు వైసీపీకి పడ్డాయి.

ఎన్నికల సమయంలో.. పార్టీలో మరీ అంత సీనియర్లు కాకపోయినప్పటికీ.. చంద్రబాబు మీద అనేకమంది నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. వారికి సర్దిచెప్పడం అనేది చంద్రబాబునాయుడుకు తలకుమించిన భారం అవుతోంది. ఆయన వల్ల కావడంలేదు. పార్టీ మీద చంద్రబాబుకు ఏమాత్రం పట్టులేదన్న సంగతి బయటపడిపోతోంది. జగన్‌ ఓటమే లక్ష్యంగా బీజేపీ, జనసేనలకు కొన్ని సీట్లను చంద్రబాబు త్యాగం చేయాల్సి వచ్చింది.

టికెట్లన్నీ ప్రకటించిన తర్వాత.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటును మార్చడం అనేది చంద్రబాబు చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి. రఘురామ ఒత్తిడికి తలొగ్గి దానిని ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా.. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. పెడనలో బూరగడ్డ వేదవ్యాస్‌ ఇండిపెండెంటుగా అయినా పోటీలో ఉండి తీరుతానని అంటున్నారు. 2019లోనే చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకపోవడం దారుణం అని ఆయన అంటున్నారు.

ఇండిపెండెంటుగా పోటీ చేసి తీరుతానని అంటున్న బూరగడ్డ వేదవ్యాస్‌, పార్టీ మారే అవకాశాన్ని కూడా కొట్టి పారేయడం లేదు. అరకు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా రచ్చరచ్చ అవుతోంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే సివేరి దొన్నుదొర టికెట్‌ గురించి ఆశ పెట్టుకున్నారు. టికెట్‌ మరొకరికి దక్కడంతో.. ఇప్పుడు ఇండిపెండెంటుగా పోటీచేయబోతున్నట్టు ప్రకటించేశారు. పాడేరులో కూడా అదేమాదిరి పరిస్థితి ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ రెబల్‌ గా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆమెకు పార్టీ మారే ఉద్దేశం లేదు.

ఇండిపెండెంటుగానే బరిలోకి దిగి ఎమ్మెల్యే సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్నారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌ కు టికెట్‌ దక్కలేదు. ఆయన ఇండిపెండెంటుగా బరిలోకి దిగుతానన్నారు. తర్వాత శాంతించారు గానీ.. నామినేషన్ల సమయానికి ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్త అభ్యర్థులు పోటీచేసి తీరుతాం అని చెలరేగుతున్నారు. వారిలో కొందరిని చంద్రబాబు బుజ్జగించగలిగారు. కానీ.. ఇంకా చాలాచోట్ల పరిస్థితి చేయిదాటిపోతోంది. పైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. పార్టీ మీద ఆయన పట్టు సడలిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వీరంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం వల్ల అంతిమంగా ఓట్లు చీలిపోతాయన్నది కాదనలేని విషయం. చివరిగా దీని వల్ల అధికార వైసీపీకే కలిసొస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news