జగన్ సరికొత్త రికార్డు… ఎవరి వల్ల సాధ్యం కాదంటున్న వైసీపీ నేతలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తాను ప్రకటించినట్లుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును అర్హుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేశారు. ఇదే సమయంలో ఇప్పుడు సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు సీఎం జగన్.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… పలు రకాల ఎన్నికలు జరిగాయి. పంచాయతీ మొదలు మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్, శాసన మండలి, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, రాజ్యసభ ఎన్నికలు…. ఇలా ఎన్నో జరిగాయి. వీటన్నిటిలో కూడా వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల పరిషత్‌లు, కార్పొరేషన్లు, కూడా వైసీపీ ఖాతాలోనే చేరిపోయాయి. ఇక పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో అయితే వైసీపీకి తిరుగే లేకుండా పోయింది. కొన్ని మునిసిపాలిటిల్లో అయితే ఏకగ్రీవాలు, ప్రతిపక్షాలకు కనీసం ఒక్క స్థానం కూడా లభించలేదు.

కడప జిల్లా బద్వేలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. అయితే ఏ ఎన్నిక సమయంలో కూడా జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కనీసం కాలు బయటపెట్టలేదు. కేవలం ఓ మెసేజ్ ద్వారా మాత్రమే ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఈ పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు జగన్ రికార్డుపై గొప్పగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలు వైసీపీ అభ్యర్థులను గెలిపించారంటున్నారు. ఎవరికైనా ఇది సాధ్యమా అని సవాల్ విసురుతున్నారు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version