అభివృద్ధికి చిరునామా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

-

తెలుగు రాష్ట్ర ప్రజలకు భరోసాగా అన్నదాతలకు అండగా సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామాగా వెలుగొందిన‌ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్ధంతి నేడు. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు ఆయ‌న‌. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఆదుకున్న విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంతో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు.

జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత.పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించారు వైయస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చ‌డంతో పాటు ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పిన ఘ‌న‌త ఆయ‌న‌దే. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

క‌డ‌ప జిల్లాలోని జమ్మలమడుగులో 1949 జూలై 8న వైయస్‌ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించారు వైయస్‌ రాజశేఖరరెడ్డి. వైద్య విద్యను అభ్యసించిన ఆయ‌న‌ పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు అందుకున్నారు.డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైయస్‌ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు.

సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు ఆయ‌న‌.మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో…. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమైనా ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.

అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారిన నేప‌థ్యంలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైయస్‌ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైయస్ఆర్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగల మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్‌ ఛార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేయడం ద్వారా పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు.

1978లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారాయ‌న‌.విపక్షంలో ఉన్నా.. అధికారం చేపట్టినా ప్రజల కోసమే పోరాడారు.మూడు దశాబ్దాలకుపైగా రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని ధీరుడు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నిక కావ‌డ‌మే కాకుండా కడప లోక్‌సభ స్థానం నుంచి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం ఎగుర‌వేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఓటమే ఎరుగని నాయకులు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటారు.

అలాంటి నాయకుల్లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముందువరుసలో నిలుస్తారు.సినీనటుడు ఎన్టీఆర్‌ రాజకీయ అరంగేట్రం చేసి.. టీడీపీని స్థాపించి 1983 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలోనూ పులివెందుల శాసనసభా స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్‌ కొట్టారు.పులివెందుల శాసనసభ స్థానం నుంచి 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ కొట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి రెండోసారి హ్యాట్రిక్‌ సాధించారు. వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌రోసారి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్నారు తెలుగు రాష్ర్టాల ప్ర‌జ‌లు..

Read more RELATED
Recommended to you

Latest news