ఎన్నో అంచనాల నడుమ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్ షర్మిల. వైఎస్ కూతురిగా అందరి అభిమానం తనవైపే ఉంటుందని అనుకుంటున్నారు. కాకపోతే ఎంతసేపు తన తండ్రి పేరు చెప్పుకోవడం తప్ప ఆమె పెద్దగా కొత్త పాయింట్లపై రాజకీయాలు చేయట్లేదు. దీంతో ఆమె అభిమానులు, అనుచరులు కూడా తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఆమె మొదటి నుంచి తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకంపైనే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. తన తండ్రి పేదవాళ్ల కోసం ఈ పథకాన్ని తెచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం కరోనా ట్రీట్‌మెంట్‌ను ఇందులో చేర్చట్లేదని ఒకే విషయంపై విమర్శలు చేస్తున్నారు.
ఇది మంచిదే అయినా.. ఎప్పుడూ దీనిపైనే మాట్లాడితే రాజకీయాల్లో పెద్దగా రాణించలేరనేది కాదనలేని వాస్తవం. రాజకీయాలన్నాక ఎప్పటి సమస్యలపై అప్పుడే అధికార పార్టీని కడిగేయాలి. లేదంటే గుర్తింపు దక్కదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఆమె వాటిపై దృష్టి పెట్టట్లేదు. కేవలం తన తండ్రి తెచ్చిన పథకం చుట్టూ మాత్రమే ఆలోచిస్తోంది. ఇకనైనా ఆమె తన వైఖరిని మార్చి కొత్త విమర్శలు చేస్తే బాగుంటుందని వైఎస్ అభిమానులు ఆశిస్తున్నారు.