కుప్పం, మంగళగిరి తో సహా 175కి 175 స్థానాలను ప్రవేశం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కుప్పంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సీఎం జగన్. ఎమ్మెల్సీగా ఉన్న భరత్ను అభ్యర్థిగా ప్రకటించి.. గెలిపిస్తే క్యాబినెట్లో మంత్రి అవకాశం కల్పిస్తానంటూ ప్రకటించారు. ఈ ప్రకటనతో కుప్పం నియోజకవర్గ వైసీపీలో నూతన ఉత్సాహం నెలకొంది.. మరోపక్క నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు..
గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్.. ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అదే ఫలితాన్ని పునరావృతం చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.. ఈసారి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి అతని స్థానంలో తొలుత గంజి చిరంజీవికి అవకాశం కల్పించింది. చేనేతల ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతని ఇన్చార్జిగా ప్రకటించి గెలవాలని వైసిపి భావించిందట.
అయితే కొద్దిరోజులకే అతని పర్ఫామెన్స్ పై అధిష్టానం సంతృప్తి చెందలేదని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసిపి తీసుకొచ్చింది.. అతనితో చర్చలు జరిపింది.. అతను ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కొత్త ఇన్చార్జిని నియమించిందని మంగళగిరి నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది.
మాజీ మంత్రి మురుగోడు హనుమతంరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల కుమార్తె లావణ్యకు వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.
మంగళగిరిలో లోకేష్ ను ఓడించేందుకు మహిళా నేతను అస్త్రంగా వాడుతోంది వైసిపి.. రాజధాని రైతులు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో.. లావణ్య కు నియోజకవర్గంలో తిరుగుండదని.. లోకేష్ మరోసారి ఓడిపోవడం ఖాయమని నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. లోకేష్ కు చెక్ పెట్టేందుకే మహిళా నేతను సీఎం జగన్ రంగంలోకి దించారని పార్టీలో చర్చ నడుస్తోంది.