తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి,కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జులను ప్రకటించేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.ఈ జిల్లాలో మరో కీలకమైన అమలాపురం లోక్‌సభ అభ్యర్ధిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు మూడు నాలుగు పేర్లు పరిశీలించింది వైసీపీ అధిష్టానం.ఎస్సీ రిజర్వుడు అయిన అమలాపురం పార్లమెంటు స్థానం ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్థులను బలమైన వారిని దింపే ప్రయత్నంలో ఉండగా దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వైసీపీ చాలా పేర్లు పరిశీలిస్తోంది.స్థానిక అంశాలు,రాజకీయ పరిస్థితులు,రిజర్వేషన్‌లు వంటి అంశాలను వైసీపీ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.బలమైన అభ్యర్ధిని నిలబెట్టి మళ్ళీ వైసీపీ ఖాతాలోకి అమలాపురం లోక్‌సభను చేర్చాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.
అమలాపురం పార్లమెంటు స్థానానికి అటు మాల, మాదిగ వర్గాలను సంతృప్తి పరిచేవిధంగా అభ్యర్థిని బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం పార్లమెంటు స్థానానికి పంపాలని వైసీపీ ఆలోచిస్తోంది. ఎలీజా ఎస్సీ మాల వర్గానికి చెందిన వ్యక్తి కాగా ఆయన సతీమణి మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు విధాలుగా ఓటర్లను ఆకట్టుకోవచ్చని అనుకుంటున్నారు.అయితే చింతలపూడి నియోజకవర్గానికి ఇప్పటికే వేరే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్. దీంతో అమలాపురం లోక్ సభకు ఎలీజా ను పంపుతున్నట్లు సoకేతాలు ఇచ్చింది వైసీపీ అధిష్టానం.
అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబందించి ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన వారు అందరూ మాల సామాజికవర్గానికి చెందిన వారే.ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసినవారు అధికంగా ఉన్నారు. కుసుమ కృష్ణమూర్తి, స్వర్గీయ జీఎంసీ బాలయోగి, ప్రస్తుత ఎంపీ చింతా అనురాధ….ఈ ముగ్గురు మాత్రమే స్థానికులు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధ పేరును పున:పరిశీలిస్తున్నారు.
అయితే ఆమె ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తిగా ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మాల సామాజికవర్గానికి కేటాయిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కూడా వైసీపీ ఉంది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ప్రజల్లో ఉన్న ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు సీఎం జగన్. మొత్తానికి అమలాపురం లోక్ సభ సెగ్మెంట్ ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.