ఏపీలో ఎస్ ఈసీ పదవి ఎప్పుడూ రచ్చకెక్కుతూనే ఉంది. ఇంతకు ముందు ఉన్న నిమ్మగడ్డ రమేశ్ మున్సిపల్ ఎన్నికల విషయంలో సీఎం జగన్‌తో రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అప్పుడు ఇద్దరూ సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ ఎన్నికలు జరిపారు. అయితే ఆ టైమ్‌లో వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా టైమ్‌లో ఎన్నికలేంటని మండిపడ్డారు.
ఎన్నో వివాదాల నడుమ ఆ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేశ్ పదవీ విరమణ చేయడంతో.. మాజీ సీఎస్ అయిన నీలం సాహ్నిని ఎస్ ఈసీగా జగన్ ప్రభుత్వం నియమించింది. ఆమె పదవి కెక్కిన రోజే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నోటిఫికేషన్ ఇచ్చి వారంలోగా ఎలక్షన్లు జరిపారు.
అయితే ఇప్పుడు హైకోర్టు ఆ ఎన్నికలను రద్దు చేయడంతో ప్రతిపక్షాలు నీలం సాహ్నిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సాహ్ని సప్త సముద్రాలు ఈదింది కానీ పిల్ల కాలువలో పడిందంటూ సెటైర్లు వేశారు. జగన్ మాటలు విని అభాసుపాలయ్యారంటూ చెప్పారు. దీంతో ఎస్ ఈసీ పదవి ఒక ముళ్ల కిరీటం అని అంతా అనుకుంటున్నారు. అప్పుడు నిమ్మగడ్డ, ఇప్పుడు నీలం సాహ్ని విమర్శలెదుర్కున్నారని చెప్తున్నారు.