నారా లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్ర 200 రోజులు దాటేసింది. చిత్తూరులో ప్రారంభించిన యాత్ర సాధారణంగా మొదలై ప్రభంజనంలా కొనసాగింది. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ,ప్ర భుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, అన్ని వర్గాలను సమీకరిస్తూ యువ గళం పాదయాత్ర సాగుతోంది. అనంతపురంలో పాదయాత్ర సక్సెస్ అయిందని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో కొంచెం తగ్గినా కడపలో మాత్రం పూర్తిస్థాయి లో విజయవంతం అయింది. నెల్లూరులో సాదాసీదాగా సాగినా ప్రకాశం, గుంటూరులో మాత్రం లోకేష్ కు ప్రజలు నీరాజనం పట్టారు. లోకేష్ చేపట్టిన బహిరంగ సభలన్నీ అఖండ విజయాన్ని సాధించాయి.
ఇటు కృష్ణాజిల్లాలో కూడా అర్ధరాత్రి సమయం దాటేసిన జనం పాదయాత్రలో కనిపించారు. ఆ తర్వాత గన్నవరం సభ భారీ సక్సెస్ అయింది. ఇంకా అంతే ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన యువ గళం పాదయాత్ర నీరసంతో నిస్సత్తుగా సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఉన్నా, పది రోజులుగా జరుగుతున్న పాదయాత్ర జనం లేక వెలవెల పోవడానికి కారణాలేంటా అని విశ్లేషిస్తున్నారు.
ఆ విశ్లేషణలో తేలింది ఏంటంటే పాదయాత్రకు లోకేష్ ఎంచుకున్న రూట్ మ్యాప్ అని అందరూ అంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో పాదయాత్ర వెళితే టిడిపి అభిమానులంతా బ్రహ్మ రథం పట్టేవారు. కానీ చింతలపూడి వైపు సాగిన లోకేష్ యాత్రలో అక్కడి నాయకుల సమన్వయ లోపంతో జన సమీకరణలో అలసత్వం వచ్చింది. పోలవరం నియోజకవర్గం కూడా అంతే అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరో తెలియదు.
ఎవరు పాదయాత్ర బాధ్యతను భుజాన వేసుకోవాలో తెలియక, ఎవరికి వారు తమకు ఎందుకులే అన్నట్లు ఉండడంతో పాదయాత్రకు జనాలు కరువయ్యారు.10 రోజులుగా టిడిపికి వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో నాయకత్వలేమి వలన యువ గళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో సాదాసీదాగా సాగుతోందని చెప్పవచ్చు. అయితే భీమవరంలో వైసీపీ శ్రేణులు…పాదయాత్రపై రాళ్ళ దాడి చేయడంతో కాస్త హైలైట్ అయింది. మరి ఇక్కడ నుంచైనా పాదయాత్ర ఎలా సాగుతుందో చూడాలి.