జగన్‌తో పొంగులేటి…కారు దిగేయడానికేనా?

-

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…తన మాజీ బాస్ జగన్‌తో భేటీ కావడంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు తెలంగాణలో ఏ మాత్రం బలం లేని ఏపీ సీఎం జగన్‌తో పొంగులేటి ఎందుకు కలిశారనే ప్రశ్నలు విశ్లేషకులు నుంచి వస్తున్నాయి. అసలు ఆయన టీఆర్ఎస్‌ని వదిలిపెట్టేస్తున్నారా? మళ్ళీ వైసీపీలో చేరతారా? అసలు చేరడానికి తెలంగాణలో వైసీపీ ఎక్కడ ఉంది? అసలు పొంగులేటి రాజకీయ వ్యూహం ఏంటి? అనే అంశాలపై చర్చలు నడుస్తున్నాయి.

2014లో పొంగులేటి…వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ పూర్తిగా ఏపీ రాజకీయాల వైపు వెళ్లిపోవడంతో తెలంగాణలో వైసీపీ కనుమరుగైపోయింది. ఈ క్రమంలోనే పొంగులేటి వైసీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అలాగే వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. దీంతో తెలంగాణలో వైసీపీ క్లోజ్ అయిపోయింది. అయితే టీఆర్ఎస్‌లో పనిచేస్తున్న పొంగులేటికి 2019 ఎన్నికల్లో సీటు దక్కలేదు. నామా నాగేశ్వరరావు కోసం సీటు త్యాగం చేయాల్సి వచ్చింది.

సరే ఇంకా ఏదొక పదవి వస్తుందని పొంగులేటి చూశారు..కానీ ఇటీవల ఎమ్మెల్సీ కూడా వేరే నేతకు ఇచ్చారు. దీంతో పొంగులేటి పదవిపై ఆశలు వదులుకున్నారు. ఇలా టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న పొంగులేటి తాజాగా జగన్‌తో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ అయ్యి ఏం మాట్లాడారో బయటకు రాలేదు. కానీ పొంగులేటి మాత్రం టీఆర్ఎస్‌ని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

అదే సమయంలో జగన్ సోదరి షర్మిల పార్టీలో పొంగులేటి చేరతారని ఓ వైపు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అసలు పొంగులేటి టీఆర్ఎస్‌ని వీడతారో లేదో…అలాగే షర్మిల పార్టీ లేదా బీజేపీలో గాని చేరతారో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. చూడాలి మరి పొంగులేటి రాజకీయం ఎలా ఉంటుందో?

 

Read more RELATED
Recommended to you

Latest news