తెలంగాణలో గత కొద్దిరోజులుగా శాంతించిన వరణుడు మంగళవారం రోజున మరోసారి విజృంభించాడు. ఏకధాటిగా గంటన్నరపాటు కుండపోతగా కురిసిన వర్షంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు అవస్థలుపడ్డారు. ఇవాళ రేపు కూడా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితలద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీ మీదుగా కర్ణాటక వరకూ విస్తరించింది. బుధవారం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో శుక్రవారానికి అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. వీటి వల్ల తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.8 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సోమవారం హైదరాబాద్‌తోపాటు పలుచోట్ల భారీవర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.