బాహుబలి హీరో ప్రభాస్ లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. బాహుబలితో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రికార్డుల దుమ్ము దులిపేసి సరికొత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహోతో మరోసారి అన్ని ఇండస్ట్రీలను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక సాహో మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సాహో మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ప్రభాస్ కూడా సినిమా రిలీజ్ అవుతోన్న నాలుగు భాషల్లోనూ భారీ ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ తమిళ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నపై ఏపీ సీఎం.జగన్మోహన్‌రెడ్డిపై చాలా పాజిటివ్‌గా మాట్లాడిన ప్రభాస్ జగన్‌తో పాటు వైసీపీ అభిమానుల మనస్సులను దోచుకున్నాడు.
సదరు తమిళ్ యాంకర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గురించి చెప్పమని అడిగారు. తమిళనాట అందరూ జగన్‌ను మీ సూపర్ హిట్ సినిమా బాహుబలితో పోలుస్తూ పొలిటికల్ బాహుబలి అని పిలుస్తున్నారని… జగన్‌పై మీ అభిప్రాయం ఏంటని అడిగారు. ఈ క్రమంలోనే ప్రభాస్ స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై తనకు పెద్దగా అవగాహన లేదని… అయితే యంగ్ సీఎంగా ఆయనకు ఏపీని అభివృద్ధి చేయాలన్న కాంక్ష బలంగా ఉందని చెప్పాడు.
సీఎంగా ఆయన చాలా బాగా పని చేస్తున్నాడని… జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారనే నమ్మకం కూడా తనకు ఉందన్నాడు. ఏదేమైనా జగన్‌పై ప్రభాస్ ప్రశంసలతో మొత్తానికి సాహెకు వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.