అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ..నట్టేట్లో ముంచేశాడే గంగరాజు.. అన్న పాటను గుర్తుకు చేస్తూ.. కాంగ్రెస్‌కు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఝలక్ ఇచ్చారు. పీకే కాంగ్రెస్ లో చేరితే పరిణామాలు ఎలా ఉంటాయో? అని అందరూ విశ్లేషించుకుంటున్న తరుణంలో సంచలన ప్రకటన చేశారు. ఉన్నట్టుండి బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో తాను చేరబోవడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ నూర్జేవాలా మంగళవారం సాయంత్రం 3.41 గంటల ప్రాంతంలో ‘ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్, చర్చల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ‘‘సాధికారత చర్య బృదం- (ఈఏజీ) 2024’’ను ఏర్పాటు చేశారు. అందులో భాగమయ్యేందుకు పీకేను కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌కు సలహాలు, సూచనలు ఇచ్చినందుకు ప్రశాంత్ కిశోర్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు.
దీనిపై ప్రశాంత్ కిశోర్ 4.05 నిమిషాలకు స్పందించారు. అందులో ‘‘ఈఏజీలో భాగస్వామ్యం కావాలని, ఎన్నికల బాధ్యతలను తీసుకోవాలనే కాంగ్రెస్ ఆఫర్ ను సవినయంగా తిరస్కరిస్తున్నారు. నేను పార్టీలో చేరడం కంటే.. పార్టీకి నాయకత్వం, ఆ నాయకత్వం సంస్కరణలు చేపట్టడం ద్వారా నిర్మాణాత్మక మార్పులు చేపట్టడమనే అవసరాన్ని కలిగి ఉంది ’’ అని రిప్లయ్ ఇచ్చారు. దాంతో పీకే ఇక కాంగ్రెస్ లో చేరబోరని తేటతెల్లమయింది.
అయితే ఇన్ని రోజులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధపడి.. ఇప్పుడు చేరబోననే ప్రకటన వెనుక ఏముందని ఆరా తీస్తే.. కాంగ్రెస్ పెట్టిన షరతులే కారణమని తెలుస్తోంది. పార్టీలో చేరిన తర్వాత మమత, స్టాలిన్, జగన్, కేసీఆర్‌తో సంబంధాలు తెంచుకోవాలని, వారికి వ్యూహకర్తలుగా పని చేయకూడదని కండీషన్ పెట్టినట్లు సమాచారం. ఇందుకు ప్రశాంత్ కిశోర్ ససేమిరా అనడంతో పాటు కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే పార్టీ వ్యవహారాల్లో తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే పీకే షరతుకు కాంగ్రెస్ అంగీకరించకపోవడం కూడా ఓ కారణమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పీకేకు పూర్తి అధికారం ఇవ్వడానికి సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్ తవ్రంగా వ్యతిరేకించినట్లుగా తెలిసింది. వారిని కాదనలేకే సోనియాగాంధీ పీకే చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.