నడి రోడ్డు న్యాయవాది గట్టు వామన్‌రావ్ దంపతులను నరికిచంపిన ఘటన ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హత్యజరిగిన అనంతరం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అవినీతిని ప్రశ్నించినందుకు వారి ప్రణాళిక ప్రకారం హత్య చేయించారని ఆయన పేర్కొన్నారు. న్యాయవాది వామన్‌రావు గతంలోనే తనకు ప్రానహాని ఉందని కోర్టును ఆశ్రయించగా, రక్షణ కల్పించాలని కోర్డు ఆదేశించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
గతంలోనే వామన్ రావు టీఆర్‌ఎస్ నేతల అవినీతిపై పలు కేసులు వాదించారని గుర్తు చేశారు. తమను ప్రశ్నించడం, ఎదిరించడం చేస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసిందని సంజయ్ ఆరోపించారు. కోర్డు రక్షణ కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వామన్ రావ్ హత్యకు గురయ్యారంటే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా టీఆర్‌ఎస్ నాయకులు న్యాయవాద దంపతుల హత్యను బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు.
ఈ ఘటనపై సీఎం పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ పెద్ద నేతల సమాచారమంతా వామన్‌రావు దగ్గర ఉందని దాన్ని ఎక్కడ బట్టబయలు చేస్తారని ప్రణాళిక ప్రకారమే హత్య చేయించారన్నారు. ఈ హత్య వెనక ప్రభుత్వం హస్తంతో పాటు టీఆర్‌ఎస్ నేతల ప్రమేయం కూడా ఉందన్నారు. న్యాయవాద దంపతుల హత్యపై సీఎం కేసీఆర్ స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరించాలని డిమాండ్ చేశారు.