కాలేజీలో జరిగిన ర్యాగింగ్ కు మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే ప్రతిపక్షాలు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. నేడు స్టేషన్ ఘనపూర్ లో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రీతి చనిపోతే అందరం బాధపడ్డామని.. పార్టీ, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నామని అన్నారు. మా మంత్రులు వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు.
ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. ఎవరైనా వదిలిపెట్టమని, చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇక మరోవైపు రాజకీయ నిరుద్యోగులు పనికిరాని పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. చందమామలో మచ్చలను చూపెట్టినట్టు కేసీఆర్ పాలనలో పూర్తికాని పనులను చూపెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోరని అన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం చెప్పినట్టు ఉందన్నారు.