రేపు తెలంగాణకు ప్రధాని మోదీ.. బేగంపేటలో స్వాగత సభ

-

ప్రధాన మంత్రి మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మోదీ.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ సహా ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే ప్రధానికి స్వాగత సభను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేదిక నుంచి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

మే 26న హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన స్వాగత సభలో ప్రధాని సుదీర్ఘంగా రాజకీయ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగతసభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వాగత సభ అనంతరం ప్రధాని హెలీకాప్టర్‌లో రామగుండం వెళతారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నేతలు మోదీకి అక్కడ స్వాగతం పలకనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భద్రాచలం రోడ్‌ సత్తుపల్లి రైలు మార్గాన్ని జాతికి అంకితమిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news