కరోనా వైరస్ విద్యార్థులకే కాదు, వారి తల్లిదండ్రులకూ కష్టాలను తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు పరీక్షలు రాసే అవసరం లేకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఇక టెన్త్, ఇతర బోర్డు పరీక్షలు రాసే వారి కోసం ఆ పరీక్షలనే రద్దు చేశాయి. అయినప్పటికీ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఇప్పుడు మరో రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఆన్‌లైన్ తరగతుల పేరిట నిత్యం విద్యార్థులు గంటల తరబడి ఫోన్లు, కంప్యూటర్ల ఎదుట కూర్చోలేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే.. వారి తల్లిదండ్రులు మాత్రం స్కూల్ ఫీజులు కట్టలేక తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా స్కూళ్లను ఎప్పటినుంచి ప్రారంభిస్తామనే విషయం చెప్పలేదు. అలాగే ఆన్‌లైన్‌లో విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు గాను స్కూళ్లకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. కానీ అనేక ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఇప్పటికే ఆన్‌లైన్ తరగతుల పేరిట పెద్ద ఎత్తున దందాను ప్రారంభించాయి. అందుకుగాను భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయి. అలాగే స్టేషనరీ షాపుల యజమానులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున స్కూళ్లలోనే యూనిఫాంలు, పుస్తకాలను కొనాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఫీజు కట్టడంతోపాటు, యూనిఫాంలు, పుస్తకాలను కొన్నవారికే ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన వెబ్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను అందజేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు గత్యంతరం లేక అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు.
ఇక మరోవైపు విద్యార్థులు నిత్యం గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల ఎదుట కూర్చుని ఉండలేకపోతున్నారు. వారికి ఆ అనుభవం కొత్త. దీంతో కంటి సమస్యలు, వెన్నెముక సమస్యలు వస్తున్నాయి. పెద్దలే గంటల తరబడి వాటి ఎదుట కూర్చుని ఉండలేరు. వారిపైనే ఆయా స్మార్ట్ పరికరాలు ప్రభావం చూపిస్తాయి. ఇక పిల్లలపైన అవి ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. దీనికి తోడు విద్యార్థులకు పాఠశాల తరగతి గదిలో అయితే ఉపాధ్యాయులు చెప్పేది నేరుగా వింటారు, చూస్తారు కనుక పాఠాలు సరిగ్గా అర్థం అయ్యేవి. అలాగే పక్కనే ఉపాధ్యాయులు ఉంటారు కనుక తమ సందేహాలను కూడా అప్పటికప్పుడే నివృత్తి చేసుకునే వీలు ఏర్పడింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్ విద్య కావడంతో ఆయా సదుపాయాలకు విద్యార్థులు నోచుకోవడం లేదు. దీంతో ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో చెబుతున్నది సరిగ్గా అర్థం కాక వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
అయితే ఇవన్నీ పక్కనపెడితే అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన సరైన మార్గదర్శకాలను విడుదల చేయకుండానే పాఠశాలలు ఇలా తరగతులను ఎలా నిర్వహిస్తాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లు తమ దందాను కొనసాగించడానికే, పెద్ద ఎత్తున ఫీజులను వసూలు చేసి డబ్బులు దండుకోవడానికే ఇలా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించాలని, పాఠశాలలు చేస్తున్న దందాను ఆపాలని కోరుతున్నారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.