అమరావతి : అసెంబ్లీ ప్రాంగణంలో ప్రివిలేజ్ కమిటీ భేటీ ప్రారంభం అయింది. ఛైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన ప్రివిలేజ్ కమిటీ భేటీ అయింది. మాజీ ఎమ్మెల్యే కూన రవి, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డలపై ఉన్న ఫిర్యాదులపై చర్చ జరుగుతోంది. గతంలో నోటీసు వచ్చిన సమయానికి తాను అందుబాటులో లేనని.. ఫలితంగా నోటీస్ అందుకోలేకపోయానని ప్రివిలేజ్ కమిటీకి కూన రవి సమాచారం ఇచ్చారు.
తాను హైదరాబాద్ వెళ్లాననడానికి కావాల్సిన ఆధారాలు కూడా సమర్పిస్తానన్న కూన రవి…. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం అందుతోంది. తనకు అందిన నోటీసుకు ప్రివిలేజ్ కమిటీకి లేఖ రూపంలో సమాధానం ఇచ్చారు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ.
తనకు గవర్నరుకు మధ్యన జరిగిన అంతర్గత సమావేశం వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అంశంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించానన్న నిమ్మగడ్డ. ఈ వ్యవహరం కోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తెచ్చారు. స్పీకరుపై చేసిన వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేయడంతో ప్రివిలేజ్ కమిటీ సభ్యుల అందరి అభిప్రాయాలు కోరారు ఛైర్మన్ కాకాని. సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అచ్చెన్నపై చర్యలు తీసుకునే విషయమై నిర్ణయం తీసుకోనుంది ప్రివిలేజ్ కమిటీ.