యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ఫైర్‌అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని, మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదని ప్రియాంక మండిపడ్డారు.
యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ బాగా పెరిగిందని, మహిళలపై రోజుకో లైంగికదాడి జరుగుతున్నదని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. ‘ఫిరోజాబాద్‌లో అత్యాచార బాధితురాలి తండ్రి హత్య! సీతాపూర్‌లో బాలికపై అత్యాచారం, హత్య! ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు యూపీలో సర్కారు ఎక్కడికి పోయింది?’ అని ట్విట్టర్ వేదికగా ప్రియాంక ప్రశ్నించారు.
‘చెరుకు రైతులకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వరికి మద్దతు ధర కల్పించడంలో అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.’ అని ప్రియాంక దుయ్యబట్టారు.