ప్రమాదంలో కన్నుగీటే పిల్ల కెరీర్.. ఇక కష్టమేనా?

ప్రియా వారియర్.. ఒకే ఒక కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో కళ్లు తిప్పి తన నటనతో ప్రేక్షకులను కట్టిపారేశారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ అమ్మడుకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా తర్వాత రెండు, మూడు భాషల్లో కొన్ని సినిమాలు చేశారు. అవేవీ తొలి సినిమాలాగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. దాంతో ఉన్న క్రేజ్ కాస్త పడిపోయింది. మరోవైపు కరోనా నేపథ్యంలో షూటింగులు బంద్ అయ్యాయి. దీంతో ఆమెను మర్చిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

చాలా ఆశలతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నదానికి పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. నితిన్ హీరోగా చేసిన ‘చెక్’ సినిమాలో నటించినా ఆకట్టుకోలేకపోయారు. అమ్మడి గురించి ఏదో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ‘చెక్’ సినిమా తరువాత తెలుగులో ఆమె ఒక్క ప్రాజెక్టు కూడా ఒప్పుకోలేదు. పలానా సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారనే వార్తలు కూడా వినిపించడంలేదు.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘ఇష్క్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఇక బాలీవుడ్, కోలివుడ్‌లోనూ ఈ చిన్నది తన అదృష్టాన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. చేతిలో ఒక హిందీ .. ఒక కన్నడ సినిమాలు ఉన్నాయి. దీంతో వీటిపైనే అమ్మడి కెరీర్ ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ప్రియా వారియర్ లక్ మరోసారి ఎలా ఉంటుందో చూడాలి