ఎరక్కపోయి ఇరుక్కుపోయిన జంపింగ్ ఎమ్మెల్యేలు?

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడుప్పుడే కష్టాలు మొదలవుతున్నట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేలపై పెద్దగా పోరాటం చేసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పరిస్తితి పూర్తిగా మారింది. ఈయన జంపింగ్ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

ఒకవేళ న్యాయ పోరాటంలో విఫలమైన, ప్రజా క్షేత్రంలో మాత్రం ఆ జంపింగ్ ఎమ్మెల్యేలని వదలకూడదని రేవంత్ భావిస్తున్నారు. అయితే రేవంత్ పోరాటం ఏమో గానీ, దానికంటే ముందే కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకిత మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దళిత, గిరిజన రిజర్వడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపించేలా ఉన్నాయి.

గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజర్వడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అయితే ఆ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. టీఆర్ఎస్ మీద వ్యతిరేకితని చూపుతూ కాంగ్రెస్ తరుపున పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావులని గెలిపించారు. కానీ వారు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి గులాబీగూటికి చేరారు.  అయితే ఇప్పుడు వారికి ప్రజల నుంచే నిరసన సెగలు తగిలేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే పోడు భూముల విషయంలో ఆయా నియోజకవర్గాల్లో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అటవీశాఖ అధికారులు వచ్చి భూముల్లో కంచెలు వేస్తూ కేసులు పెడుతుండటంతో పోడు రైతులు ఆవేదన చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోడు రైతులు ఆందోళనలు తెలియజేయడం మొదలుపెట్టారు. ఆ భూములకు పట్టాలు ఇప్పించాలని,  ఇప్పించకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. వాళ్ళ పరిస్తితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. పోడు రైతులకు మద్ధతు ఇస్తే కేసీఆర్ ఆగ్రహానికి గురవుతారు. కాదని అలాగే ఉంటే రైతుల ఆగ్రహానికి గురవుతారు. ఏదేమైనా జంపింగ్ ఎమ్మెల్యేలు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లే కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news