త్వరలోనే హైదరాబాద్‌ లో సనోఫీ వ్యాక్సిన్‌ ఉత్పత్తి

తెలంగాణ ప్రతినిధి బృందం రెండవ రోజు పారిస్‌లో వివిధ గ్లోబల్ సీఈఓలతో సమావేశాలు నిర్వహించింది. ఫ్రాన్స్‌లో వ్యాపార పర్యటనలో భాగంగా రెండో రోజు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పలు ఫ్రెంచ్‌ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది.

అలాగే… పరిశ్రమల మంత్రి కేటీఆర్ పారిస్‌లో సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా మరియు గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ ను కలిశారు.  సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుండి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం పారిస్‌లో ADP చైర్మన్ & CEO అగస్టిన్ డి రోమనెట్‌తో సమావేశమైంది.

ADP ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడి పెట్టింది.ఈ సమావేశంలో, మంత్రి కేటీఆర్ భారతదేశంలో విమానయాన రంగం వేగవంతమైన వృద్ధి దశలో ఉందని, కరోనా ఆంక్షలు సడలించడంతో పరిశ్రమ దేశంలో పెద్దఎత్తున విస్తరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అనేక ప్రధాన ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని మంత్రి తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చి సరఫరా చేయాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు.