హనుమకొండలోని హరిత హోటల్ లో గద్దర్ సంస్మరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్దర్ గళం ఫౌండేషన్ కార్యదర్శి పసునూరి రవీందర్, కూరపాటి వెంకట నారాయణ,ప్రొఫెసర్ కంచ అయిలయ్య, పలువురు విద్యార్థి సంఘాల నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచ అయిలయ్య మాట్లాడారు.బాల సముద్రంలోని కాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కళాక్షేత్రంలో గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలని అన్నారు.కళాక్షేత్రానికి కాళోజీ పేరు ఉంచాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. కాళోజీ ఒక కవి అని.. కళాక్షేత్రానికి ఆయన పేరు కాకుండా గద్దర్ పేరు పెడితేనే దానికి దేశంలో ఒక గుర్తింపు, గౌరవం వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, ముద్రను మార్చినట్టే అలాగే కాళోజి కళాక్షేత్రం పేరును మార్చాలని విజ్ఞప్తి చేశారు.వరంగల్ జిల్లాలో చుక్క సత్తయ్య, శంకర్, సారంగపాణి లాంటి ఎందరో కళాకారులు జన్మించారని , ఇక్కడి కళాక్షేత్రాలకు వాళ్ల పేరు పెట్టే ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కళాక్షేత్రాలకు కళాకారుల పేరు మాత్రమే పెట్టాలని.. కాళోజీ పేరు ఏదైనా లైబ్రరీకి పెట్టాలని ఆయన అన్నారు. వెంటనే గద్దర్ విగ్రహ స్థాపక కమిటీ వేసి కళాక్షేత్రంలో గద్దర్ విగ్రహం పెట్టాలని గతంలో కేసీఆర్ చేసిన తప్పులు ఈ ప్రభుత్వ చేయొద్దని అన్నారు.