విశాఖ జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం నర్సీపట్నం. ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ హవా జోరెత్తింది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి ఇక్కడ మంచి ఓటు బ్యాంకు కూడా ఉంది. టీడీపీ తరపున మొత్తం ఐదు సార్లు ఆయన ఇక్కడ విజయం సాధించారు. ఒకే ఒక్కసారి ఉప పోరులో వేరే నాయకుడు ఇదే పార్టీ జెండాపై విజయం సాధించారు. తనదైనవ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అయ్యన్న.. ఈ ఏడాది ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అదే సమ యంలో రెండో సారి వరుసగా పోటీ చేసిన వైసీపీ నాయకుడు, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే, ఇప్పటి వరకు పెద్దగ ఉమాశంకర్ తనదైన శైలిలో రాజకీయాల్లో స్పందించింది లేదు.
నియోజకవర్గంలో కానీ, అటు అసెంబ్లీలో కానీ తనదైన బాణీ వినిపించలేక పోయారనే చెప్పాలి. అయితే, ఇక్కడ వైసీపీ పునాదులు బలంగా వేసుకునేందుకు చాలా మేరకు అవకాశం ఉంది. సుదీర్ఘకాలంలో నరీపట్నం నియోజకవర్గం అయ్యన్న పాత్రుడి చేతు ల్లోనే ఉంది. దీంతో ఎవరినీ ఆయన ఎదగనివ్వలేదనే ఆరోపణలు టీడీపీలో బలంగా ఉన్నాయి. అదే సయమంలో కుటుంబం లోనే ఆయనకు పెద్దగా మద్దతిచ్చేవారు కూడా లేక పోవడం గమనార్హం. పార్టీలో ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడడం, పక్క నేతల విష యాల్లో జోక్యం చేసుకోవడం వంటివి అయ్యన్నకు మైనస్‌గా మారిపోయాయి. ప్రజలకు చేరువలోనే ఉంటున్నా.. వారికి పనులు చేయించలేని నిస్సహాయతను అయ్యన్న ఎదుర్కొన్నారు.
సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నా అయ్యన్న నియోజకవర్గానికి చేసిందేమి లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2014లో కేవలం రెండు వేల ఓట్లతో మాత్రమే బతికానురా దేవుడా! అ నుకొంటూ విజయం సాధించిన అయ్యన్న ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు 24 వేల ఓట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయ్యా రు. దీంతో ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకత ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని ఇక్కడ బలంగా తీసుకుని వెళ్లేందుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. ఇది మరింతగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉమాశంకర్‌కు కలిసి వచ్చే పరిణామం.
టీడీపీ నాయకులను సాధ్యమైనంత వరకు వైసీపీకి చేరువ చేసే అవకాశం ఉండడంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కూడా ఆయనకు ఇది చక్కని ఛాన్స్ అని అంటున్నారు పరిశీలకులు. అయితే, దీనిని ఆయన ఏమేరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? ప‌్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారు? అనేది ఇప్పుడు కీలకంగా ఉన్న ప్రశ్న. మరి ఆయన ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.