“జోరుమీదున్నావె తుమ్మెదా… ఈ జోరెవరికోసమే తుమ్మెదా?“- అన్నారు ఓ సినీ కవి! ఇప్పుడు ఇది పూర్తిగా జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అన్వయం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు. రాజకీయంగా ఆయన రాజధాని విషయంలో పెంచిన జోరు ఆయన కు కాకుండా ఎవరికో లబ్ధి చేకూరుస్తోందనే వాదన బలంగా వినిపిపిస్తోంది. రాజకీయాల్లో ఎవరు ఎవరికి సహకారం అందించినా.. అంతిమంగా సొంత ప్రయోజనాలే ముఖ్యం. అయితే, పాపం.. పవన్ మాత్రం సొంత ప్రయోజనం కాకుండా గతంలో తాను మద్దతిచ్చిన ఓ పార్టీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నారని విమర్శకులు, విశ్లేషకులు ప్రగాఢంగా భావిస్తున్నారు.
గతంలో రాజధాని రైతుల కోసం ఉద్యమించింది పవనే. అప్పట్లో చంద్రబాబు ఈ భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆయన రోడ్డెక్కారు. అయితే, ఇప్పుడు ఇదే రాజధానిలో రైతులకు తిరిగి భూములు ఇచ్చేసి.. వారికి ప్లాట్లు కూడా అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతున్న ప్రభుత్వ వాదనతో ఆయన ఎందుకో ఏకీభవించలేక పోతున్నారు. అదేసమయంలో విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని తాను గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే చెప్పానని అంటున్న పవన్.. మరి ఇప్పుడు విశాఖలో పాలనా రాజధానినిఏర్పాటు చేసేందుకు జగన్ అండ్ బృందం చేస్తున్న ప్రయత్నాలను ఎందుకు విమర్శిస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక, కర్నూలు నుంచి తాను పోటీ చేస్తానని గతంలో ఒకసారి చెప్పారు. అంతేకాదు, కర్నూలు రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. అనేక మంది రాజకీయ మిత్రులు కూడా తనకు సీమలో ఉన్నారని గతంలో అనేక సందర్భాల్లో పవన్ వెల్లడించారు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తానంటూ.. ముందుకు వస్తుంటే.. పవన్ ఎందుకు కొర్రీలు వేస్తున్నారు? ఇక, తాజాగా అమరావతిలో పర్యటించిన పవన్.. తన ప్రసంగాల్లో చంద్రబాబును సునిశితంగా విమర్శించినా.. ఆ విమర్శలు టీడీపీ నాయకులకు వినసొంపుగా ఉండడం గమనార్హం.
ఇక, మూడు రాజధానుల ప్రస్థావనపై తన స్టాండును ఆయన చెప్పకనే చెప్పినా.. రాజధానుల విషయం రాష్ట్రాల జాబితాలో ఉన్న విషయాన్ని గమనించకపోవడం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. మందడంలో చేసిన హడావుడి కానీ, పోలీసులపై చేసిన వాగ్యుద్ధం కానీ.. పవన్‌కు రాజకీయంగా పెద్దగా ఫలించే అవకాశం కనిపించడం లేదు. ముందు తను విశాఖ, కర్నూలు సహా ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయాన్ని స్పష్టం చేసి.. జగన్ నిర్ణయాన్ని తప్పుపడితే..ఎవరైనా హర్షిస్తారు. అలా కాకుండా కేవలం ఓ పార్టీకి మద్దతుగా ఆయన గళం విప్పుతున్నారనే వాదనను మరింత బలోపేతం చేసుకునే రీతిలోనే ఆయన పర్యటన ఉండడాన్ని మాత్రం జనసేన నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు.