చైనా యాత్రికుడి కథ : బౌద్ధంలో జ్ఞానం పెంచుకోవడానికి హుయాన్ సాంగ్ అనే చైనా వ్యక్తి ఇండియా వద్దాం అనుకున్నాడు. దానికి చైనా అనుమతి ఇవ్వలేదు. అయినా సరే ఆగకుండా గోబి ఎడారి దాటి, సెంట్రల్ ఆసియాలో ఖషాగర్, సమర్ఖండ్ దాటి ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాడు. ఆ తర్వాత పెషావర్ మీదుగా తక్షశిల వచ్చి అక్కడున్న బౌద్ధ సన్యాసులను కలుసుకున్నాడు. బౌద్ధ స్థూపాలు, స్మారక కట్టడాలను దర్శించుకున్నాడు. కాశ్మీర్, అయోధ్య ఇంకా దక్షిణ భారతదేశం కూడా వచ్చాడు.
నలందాలో ఐదేళ్ళపాటు జ్ఞానం సంపాదించాడు. ఇలా 14ఏళ్ళు ఇండియాలో ఉండి, అప్పుడు చైనా వెళ్తే, అప్పుడు అతన్ని చైనా ప్రభుత్వం శాలువా కప్పి సత్కరించింది. మరదే చైనా నుండి ఇండియాకి విమానాల్లో వేల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం. వాస్కోడిగామా, కొలంబస్ గురించి చర్చించుకుంటాం. ఎందుకు?
ఎందుకంటే వాళ్ళంతా జీవితంలో ప్రయాణం చేసారు. అందుకే ఒక గోల్ పెట్టుకోవాలి. అప్పుడే అక్కడ ఒక దారి కనిపిస్తుంది. ఆ దారిలో నడుచుకుంటూ వెళ్ళడమే. ప్రయాణం చాలా ముఖ్యం. నీ స్నేహితుడు, నువ్వు కలిసి ఎవరెస్టు ఎక్కాలని అనుకున్నారు. కావాల్సినవన్నీ కొనుక్కుని నేపాల్ వెళ్ళి బేస్ క్యాంప్ చేరుకున్నారు. విపరీతమైన చలి, క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుంటూ అక్కడున్న షేర్పాస్ తో మాట్లాడుకున్నారు.
మరుసటి రోజు ప్రయాణం ప్రారంభించారు. లోయలు దాటుకుంటూ వెళ్ళారు. కొండ మీద మంచుని గొయ్యిలా తవ్వి అందులో పడుకున్నారు. అక్కడ వేడి వేడి నూడుల్స్ చేసుకుని తిన్నారు. చివరగా ఎవరెస్టు దగ్గరదాకా వచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరెస్టు ఎక్కాడు. నువ్వు వంద అడుగుల కిందే ఉండిపోయావు. ఆ రోజు వాడొక్కడే ఎవరెస్టు మీద ఉన్నాడు. వాడు మాత్రం అక్కడ ఎంతసేపు ఉంటాడు. కాసేపట్లో నీ దగ్గరకే వస్తాడు. రారా మావా అని ఇద్దరూ కలిసి ఇంటికెళ్ళిపోతారు.
మీ ఇద్దరిదీ మళ్ళి ప్రయాణం మొదలవుతుంది. లైఫ్ లో ఎంత సక్సెస్ వచ్చినా ఎవరెస్టు మీద ఎవరూ ఎక్కువ సేపు ఉండలేరు. అందుకే ఫెయిల్ అయ్యామని ఎప్పుడూ బాధపడకూడదు. ఒక్కోసారి మీరు గోల్ చేరవచ్చు, చేరలేకపోవచ్చు. ఏమీ కాదు. అందరూ ఎక్కువ కాలం గడిపేది ప్రయాణంలోనే. సక్సెస్ లో కాదు. అందుకే ప్రయాణాన్ని ఆనందించండి.