ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ మరో అడుగు వేసింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ‘ఈ- గరుడ’ పేరుతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. 10 ఈ – గరుడ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించిన టీఎస్‌ఆర్టీసీ.. వీటిలో 10 బస్సులను మియాపూర్‌లో ప్రారంభించారు. మిగతా బస్సులు ఈ ఏడాది చివరినాటికి విడతలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
హైటెక్ హంగులతో హైదరాబాద్- విజయవాడ మార్గంలో 20 నిమిషాలకో ఈ- గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది. రెండేండ్లలో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ – విజయవాడ మధ్య ఇంటర్ సిటీ బస్సులు ప్రారంభించామని తెలిపారు. ఈ-గరుడ బస్సులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్ నగరంలో త్వరలో ఎలక్ట్రిక్, డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలో 10 డబుల్ డెక్కర్, 550 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు.