బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఖమ్మం నియోజకవర్గం సమగ్రాభివృద్ధిని సాధించిందని బీఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావ.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. అసభ్య పదజాలంతో దూషించడం, అహంకార దర్పాన్ని ప్రదర్శించడం, కాలు మీద కాలు వేసుకొని ప్రజలకు చెప్పులు చూపించడం తప్పా ఆయన మరేమీ చెయ్యలేదని దుయ్యబట్టారు.
ఖమ్మం నియోజకవర్గం ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందే నాటికి ఇక్కడి తాగునీటి సమస్య ఎలా ఉందో తనకు ఇంకా గుర్తే ఉందని అన్నారు. అందుకే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి నడుం బిగించానని గుర్తుచేశారు. తుమ్మల పదవీకాలం పూర్తయ్యే నాటికి ఖమ్మంలో నాలుగే ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేవని, తాను మంత్రిని అయ్యాక వాటి సంఖ్య 24కు పెంచానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.350 కోట్లతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించానని అన్నారు.