రాచిన్ పేరు వెనుక మర్మమేమిటి? సచిన్, రాహుల్ ద్రావిడ్‌కు సంబంధమేటి?

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్‌ ద్వారా తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్ రాచిన్ రవీంద్రన్ ప్రస్తుతం అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఎందుకంటే, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ పేర్లను కలిపి అతనికి పేరు పెట్టడమే ఇందుకు కారణం.

రాహుల్ ద్రవిడ్ పేరులోని తొలి అక్షరం ‘రా’, సచిన్‌లోని చివరి రెండు అక్షరాలను కలిపి రాచిన్ రవీంద్రన్ అని పేరు పెట్టారు అతని తల్లిదండ్రులు.

ఈ ఏడాది మొదట్లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన న్యూజిలాండ్ బృందంలో రాచిన్ రవీంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. కానీ, తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయాడు.

ఇప్పటివరకు భారత సంతతికి చెందిన దీపక్ పటేల్, ఇష్ సోధి, జీతన్ పటేల్, జీత్ రావల్, అజాజ్ పటేల్, రోనీ హీరా, తరుణ్ నేతుల్లా న్యూజిలాండ్ తరఫున క్రికెట్ ఆడారు. వారి సరసన రాచిన్ రవీంద్రన్ చేరారు.

2016లో అండర్ -19 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టీమ్ తరఫున రాచిన్ ఆడారు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ తదితరులతో కలిసి ఆ వరల్డ్ కప్‌లో పోటీ పడ్డారు.

ఎడమ చేతి వాటం స్పిన్ బౌలర్ అయిన రాచిన్ రవీంద్రన్ స్పిన్‌కు అనుకూలించే గ్రీన్ పార్క్ వికెట్‌పై సీనియర్ ఇండియన్ టీమ్‌ను ఎదుర్కోబోతున్నాడు.

న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో 1999, నవంబర్ 18న రాచిన్ రవీంద్రన్ జన్మించారు. ఆయన రవి కృష్ణమూర్తి బెంగళూరు వాస్తవ్యులు. ఆయన సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఆర్కిటెక్. 1990లో బెంగళూరు నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లారు. అక్కడే పుట్టిన రాచిన్ రవీంద్రన్ న్యూజిలాండ్ తరఫున ఆరు టీ20లు ఆడారు.