సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేయాలన్నది ప్రతీ ఒక్క దర్శకుడి కల. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న రజినీని కమర్షియల్ ఫార్మాట్లో చూపిస్తే బాక్సాఫీస్ బద్దలవుతుందున్న విషయం దర్శకులందరికీ తెలిసిందే. ఏడు పదుల వయసుకు దగ్గర్లో ఉన్నా ముప్పై యేళ్ల యువకుడిలా దూసుకుపోతున్నాడు.
వరుస ప్రాజెక్ట్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రజినీ.. చకచకా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. కబాలి, కాలా, పేట్టా, దర్బార్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలు సైతం షాక్ అయ్యేలా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు.
తలైవా ప్రస్తుతం శివ దర్శకత్వలో అన్నాత్తె (తెలుగులో అన్నయ్య అని పరిశీలిస్తున్నారు) చిత్రాన్ని చేస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే కుష్బూ, మీనా, కీర్తి సురేష్, ప్రకాశ్ రాజ్ వంటి భారీ క్యాస్టింగ్‌ను రంగంలోకి దించాడు. అయితే ఇది పట్టాల మీదుండగానే.. రాబోయే తదుపరి చిత్రాల గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీ తన 169వ చిత్రాన్ని చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఇక 170వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం రాఘవ లారెన్స్‌కు దక్కినట్టు టాక్. రజినీకి లారెన్స్ వీరాభిమాని, భక్తుడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవలె రజినీకి కథ వినిపించినట్టు, ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది చివర్లో లారెన్స్-రజినీ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ కోడై కూస్తోంది.