ఏపీలో రాజకీయం తారాస్తాయికి చేరింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు, వైసీపీ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ నేతలపై చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రఘురామకృష్ణంరాజు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. అలాగే ఆయనపై మందిపడ్డారు.
రఘురామకృష్ణంరాజు ఇంత దుర్మార్గుడని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు ఓ ఆర్థిక నేరస్తుడని… అతడిపై ఢిల్లీలో 420 కేసు నమోదైందని తెలిపారు. ఆయన ఒక 420 అని, ఒక దొంగ అని తమకి ఇప్పుడే తెలిసిందని కొట్టు సత్యనారాయణ అన్నారు. కేవలం సీఎం జగన్, పార్టీ ఆదేశాల వల్లే అతడి గెలుపు కోసం తామంతా కలిసి పని చేశామని చెప్పారు. జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం ఎప్పటికప్పుడు దృష్టి పెడుతోందని అన్నారు. రఘురామకృష్ణంరాజు విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా… తాము కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే అతడిని కలుపుకుపోయే పరిస్థితి రాదని అన్నారు. తనను గెలిపించిన పార్టీ కార్యకర్తలపైనే రఘురామకృష్ణంరాజు కేసులు పెడుతున్నారని విమర్శించారు.