తెలంగాణలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురావడానికి రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 6 వ తేదీని వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సభ వేదికగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో రైతాంగ సమస్యలు, కౌలు రైతుల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్ తయారు చేసినట్లుగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రైతులకు ఏమి చేయబోతున్నామనేది రాహుల్ గాంధీ సభలో ప్రకటిస్తారని వెల్లడిచారు. తెలంగాణలో కౌలు రైతులు రైతుబంధు రాక నష్టపోతున్నారని… ఏపీలో కౌలు రైతులకు రూ. 12,500 ఇస్తున్నారని వెల్లడించారు. రాహుల్ గాంధీ ఓయూకు కూడా వస్తారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు కోమటిరెడ్డి.