కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఇవాళే నోటిఫికేషన్ విడుదలయింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు దూరంగా ఉంటున్న హస్తం అగ్రనేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ‘ఒకే వ్యక్తికి ఒకే పదవి’ అన్న నిర్ణయాన్ని కచ్చితంగా ఫాలో అవుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అనేది ఒక సంస్థాగత పదవి మాత్రమే కాదని.. అది ఒక సైద్ధాంతిక, నమ్మకమైన వ్యవస్థ అని అభివర్ణించారు.
రాజస్థాన్లోని ఉదయ్పుర్లో జరిగిన చింతన్ శిబిర్లో ఏదైతే తీర్మానించామో.. దానికి తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్కు ఎవరు అధ్యక్షులు అయినా.. ఆ పదవి కొన్ని ఆలోచనల సమూహం అనే విషయం గుర్తుంచుకోవాలని రాహుల్ సూచించారు. ‘మీరు చరిత్రాత్మక స్థానంలో అడుగు పెట్టబోతున్నారు.. ఆ స్థానం దేశ ఆకాంక్షను ప్రతిబింబించింది.. ఇకపై ప్రతిబింబిస్తుంది’ అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించారు రాహుల్ గాంధీ. మతతత్వాన్ని ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.