తెలంగాణకు రెయిన్ అలెర్ట్… నేడు కూడా రాష్ట్రంలో వర్షాలు

తెలంగాణను అకాల వర్షాలు వదలడం లేదు. వరసగా మూడు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుతో పాటు వడగళ్ల వానలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో మిర్చి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇదిలా ఉంటే నేడు కూడా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటక నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించి ఉంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురువనున్నాయి. నేడు రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు గాలిలో తేమ శాతం సాధారణం కన్నా 23 శాతం అధికంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం తగ్గింది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు.

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్ల వానలు కురిశాయి. దీంతో చాలా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.