దేశంలో ఈశాన్య రుతుపవనాల ఆగమనం ప్రారంభమైనట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే వీటి ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. నైరుతి రుతుపవనాల తిరోగమనంతో వర్షాలు ముఖంచాటేశాయి. దీంతో జనం ఎండకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే.. తాజాగా దేశంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజుల్లో తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉండగా.. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయవ్య దిశగా ప్రయాణిస్తు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వాయుగండంగా మారాక ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని, తీరం వెంట గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలున్నాయని చెప్పింది.