తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ఏర్పడిన 24 గంటల తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ప్రభుత్వం, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర తీరానికి దగ్గరలో అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలానే మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా అక్టోబర్ 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్ని చోట్ల, రేపు మరియు ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.