న్యూఢిల్లీ: దేశంలో మరో రెండు రోజలు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కొంకణ్, బీహార్ ప్రాంతాల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. భారీవర్షాల వల్ల పలు లోతట్టుప్రాంతాల్లో వరదనీరు ప్రవహించే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. అధికారులు సహాయచర్యలు పాల్లొనాలని పిలుపునిచ్చారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ , రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరిత ద్రోణి ఆవరించిఉంది. ఈ ప్రభావంతో జులై 21 వరకు వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ అధికారులు చెప్పారు.
హైదరాబాద్ రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.