ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా తప్పుకున్న విషయం విదితమే. వ్యక్తిగత కారణాల వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నానని రైనా చెప్పాడు. కానీ దుబాయ్‌లో తనకు కేటాయించిన హోటల్ గది నచ్చకపోవడం వల్లే మనస్థాపం చెందిన రైనా టోర్నీ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. అయితే రైనా చేసిన ఈ పని వల్ల ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో అతని బంధం ముగిసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.
సురేష్ రైనా నిజానికి దుబాయ్‌లో క్వారంటైన్ సమయంలో టీం మేనేజ్‌మెంట్‌తో సరిగ్గా ప్రవర్తించలేదని తెలిసింది. కోచ్, కెప్టెన్, మేనేజర్‌లకు సహజంగా ఎక్కడైనా సూట్ రూమ్‌లు కేటాయిస్తారు. కానీ రైనా కూడా తనకు ఆ రూమ్ కావాలని పట్టుబట్టాడట. దీంతో చెన్నై టీం మేనేజ్‌మెంట్ అసహనానికి లోనైనట్లు తెలిసింది. మరోవైపు అతని స్నేహితుడు, సీఎస్కే కెప్టెన్ ధోనీ చెప్పినా రైనా వినిపించుకోలేదని తెలిసింది. అందువల్లే రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. అయితే రైనా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో ఇప్పుడతను ఇక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే అవకాశం లేదు. పైగా సీఎస్‌కేతో తాజాగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో అతని క్రికెట్ కెరీర్ కూడా ముగిసినట్లేనని అంటున్నారు.
అయితే రైనా క్షమాపణలు చెప్పి మళ్లీ వస్తే టీంలోకి తీసుకుంటామని చెన్నై జట్టు ప్రతినిధి ఒకరు మీడియాతో అన్నట్లుగా సమాచారం. కానీ రైనా వస్తాడా, రాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సీఎస్‌కే టీం 2021 ఐపీఎల్‌కు కూడా రైనాను తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే సీఎస్‌కేతో రైనా బంధం ఇక ముగిసినట్లేనని స్పష్టమవుతుంది. దీంతో రైనా మళ్లీ ఐపీఎల్ వేలంలో పాల్గొని ఇతర జట్లలో ఆడేందుకు అవకాశం ఉంటుంది. కానీ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన రైనాను, ఈ వివాదాలలో ఉన్న అతన్ని మళ్లీ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయా, దగ్గరి స్నేహితుడు ధోనీకే దూరమైన అతను ఇతర జట్లలో ఎలా ఉంటాడు ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొత్తం మీద సురేష్ రైనా ఆవేశపూరితంగా తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అతని ఐపీఎల్ కెరీర్ కూడా ముగింపుకు వచ్చిందని అంటున్నారు. మరి ముందు ముందు ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.