తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వడగళ్ల వాన కురుస్తుంది. మరి కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో భారీ వాన పడుతోంది.
ఒక్క సారిగా చల్లబడిన వాతావరణంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఉక్కపోతతో, సూర్యుడి భగభగలతో ఉక్కిరబిక్కిరైన ప్రజలు చిరుజల్లులు కురవడంతో మురిసిపోతున్నారు. వర్షంలో అడుతు పరవశించి పోతున్నారు.
అకస్మాత్తుగా వాన పడటంతో పనుల మీద బయటకు వెళ్లిన వారంతా తడిసిపోతున్నారు. ముఖ్యంగా కళాశాలకు వెళ్లిన విద్యార్థులు వానలో తడిసి ముద్దవుతున్నారు. పలు ప్రాంతాల్లో వాన నీరు రహదారులపై చేరి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వానలోనే వాహనదారులు వేచి చూడాల్సివస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరోవైపు భారీ వృక్షాలు కూలిపోయాయి.