ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు.. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తరాంధ్రకు మరో ముప్పు పొంచి ఉంది. గత వారం గులాబ్ తుఫాన్ తో అతలాకుతలం అయిన ఉత్తరాంధ్ర జిల్లాలకు అల్పపీడనం రూపంలో మరో ముప్పు రాబోతోంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావారణ శాఖ తెలిపింది. ఒడిశా వైపు పయణించి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 14,15 తేదీల్లో తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. గులాబ్ తుఫాన్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ఉత్తరాంధ్ర వాసులను అల్పపీడనం బయపెడుతోంది. గత తుఫాన్ సమయంలో భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనంతో మరెంత నష్టం ఏర్పడుతుందోనని భయపడుతున్నారు.