తెలంగాణలోని పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షం ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ఎండ పెరుగుతూ ఉండగా.. మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఆదివారం వరకు పలు జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల తీవ్రంగా పంట నష్టం జరిగింది. మరోమారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.