వర్షాల ధాటికి తమిళనాడులో ఇప్పటివరకు 12 మంది మరణం.

తమిళనాడును వర్షాలు వదలడం లేదు. గత వారం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. చెన్నై నగరం వానలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 12 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 11న తీరం దాటే అవకాశం ఉంది. కారైకల్, కడలూర్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. తమిళ నాడులో 20 జిల్లాలకు మరో 48 గంటల పాటు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

తాజాగా తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు ఆరాష్ట్ర రెవెన్యూ ,డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 07 ఎస్డీఆర్ఎఫ్ దళాలు పాల్గొంటున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి చెన్నైలో 150-200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.