భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మధ్య, దక్షిణ భారతదేశ వాసులకు శుభవార్త చెప్పింది. వచ్చే వారం నుంచి ఆయా ప్రాంతాల్లో వర్షాలు ఊపందుకుంటాయని తెలిపింది. వచ్చే వారం వరకు బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడి ఒడిశా మీదుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వచ్చే వారం నుంచి వానలు జోరుగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
కాగా 4 రోజులు ఆలస్యంగా రావాల్సిన రుతుపవనాలు ముందే వచ్చాయని, దీంతో జూన్ 1న అవి కేరళ తీరాన్ని తాకాయని ఐఎండీ తెలియజేసింది. సైక్లోన్ నిసర్గ కారణంగానే రుతు పవనాలు ముందుగా వచ్చాయని పేర్కొంది. అయితే రుతు పవనాల ప్రభావం వల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణలలో వచ్చే వారం నుంచి వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జూన్ 1వ తేదీ వరకే దేశంలో 9 శాతం వర్షపాతం నమోదైందని.. దీన్ని బట్టి చూస్తే ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.