రాజమండ్రిలో పట్టుకోసం ఎంపీ,ఎమ్మెల్యే మధ్య వార్…?

-

ఒకరు ఎంపీ… మరొకరు ఎమ్మెల్యే. ఇద్దరూ అధికారపార్టీ ప్రజా ప్రతినిధులే. కానీ ఒకరంటే ఒకరికి పడదు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఎడముఖం.. పెడముఖమే. ఛాన్స్‌ దొరికితే పైచేయి సాధించేందుకు వెనకాడటం లేదు. ఇదంతా గోదావరి జిల్లా నుంచి తొలిసారి చట్టసభలకు ఎన్నికైన ఎంపీ,ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న ఆదిపత్య పోరు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇద్దరూ యువకులే. తొలిసారి చట్టసభలకు ఎన్నికైన వారే. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారనే పేరుంది. కానీ.. ఈ యువ నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోంది.

రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలపై పట్టుకోసమే ఇద్దరూ రాజకీయంగా ఎత్తుగడలు వేస్తున్నట్టు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు దీనిని బలపరుస్తున్నాయట. ఈ ఆధిపత్య పోరు ఫలితంగా పార్టీ శ్రేణులు కూడా రెండుగా చీలిపోయినట్టు చెబుతున్నారు. ఆ మధ్య నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలోనూ ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజాల మధ్య విభేదాలు మరోసారి అగ్గిరాజేశాయి. వైసీపీలో కొత్తగా చేరిన వారికి భరత్‌ నామినేటెడ్‌ పోస్టులు ఇప్పించారని ఆరోపిస్తూ.. రాజావర్గం గుర్రుగా ఉందట.

వ్యాపార, సినీరంగాల నుంచి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు భరత్‌. దీంతో రాజమండ్రిలో రాజకీయంగా పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాతో గ్యాప్‌ పెరుగుతోందని కొందరి వాదన. రాజా అలా కాదు.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. జక్కంపూడి రామ్మోహన్‌రావు వారసుడిగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. రామ్మోహన్‌రావు అనుచరులంతా ఇప్పుడు రాజా చెంతకు చేరారు. ఈ విధంగా బలం.. బలగం విషయంలో తేడా రావడంతో అది నేతల మధ్య ప్రెస్టేజీగా మారుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news