దక్షిణాదిలో బాహుబలి తరువాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తొలి సారి కలిసి నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి తీవ్ర ఒత్తడిని అనుభవిస్తున్నారట.
కారోనా మహమ్మారి కారణంగా `ఆర్ ఆర్ ఆర్` ఏడు నెలల ఆలస్యం అయింది. దీంతో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్ కూడాతీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ మూవీ ఫినిష్ అయితే కానీ కొరటాల చేస్తున్న `ఆచార్య` ఫినిష్ కాదు.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాలనుకున్న సినిమా కూడా సెట్స్ పైకి కాదు. దీంతో ఈ ఇద్దరు ఒత్తిడిని ఫీలవుతున్నారట.
పెరుగుతున్న బడ్జెట్ కూడా రాజమౌళిని కలవరపెడుతోందట. అయినా సరే చారిత్రక నేపథ్య పాత్రల్ని ఓ పిక్షనల్ స్టోరీగా తెరకెక్కిస్తున్న రాజమౌళి మాత్రం మేకింగ్ విషయంలో ఎన్ని ఒత్తిడులు వున్నా రాజీపడాలనుకోవడం లేదట. `ఆర్ఆర్ఆర్` ఎలా వుండబోతోంది? ఎలాంటి చరిత్రని సృష్టించబోతోంది? అన్న విషయాల పట్ల రాజమౌళికి ఫుల్ క్లారిటీ వుందట. అందుకే ప్రతీ షాట్ విషయంలో రాజీపడటం లేదట. ఎంత ఒత్తిడి వున్నా రోజుకి మూడు నుంచి నాలుగు షాట్‌లు మాత్రమే తీస్తున్నారట. రాజమౌళి వర్క్ వల్ల ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ తదుపరి చిత్రాల్ని వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాత కూడా మొదలుపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్, కొరటాల శివ ఏం చేస్తారో చూడాలి.