దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ ప్రభుత్వం ఏనుగులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించింది. ఆ రాష్ట్రంలోని జైపూర్‌లో ఉన్న 110కి పైగా ఏనుగులకు ప్రస్తుతం అధికారులు పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే వాటి కళ్లు, నోటి నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. కాగా జైపూర్‌కు సమీపంలో ఉన్న గ్రామంలో 63 ఏనుగులు నివాసం ఉంటుండగా, ఆంబర్ కోట దగ్గర మరో 50 వరకు ఏనుగులు ఉంటున్నాయి. ఈ క్రమంలో వాటికి అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
సదరు ఏనుగుల నుంచి తీసిన శాంపిల్స్‌ను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు కరోనా నిర్దారణ పరీక్షల నిమిత్తం పంపించారు. అయితే సాధారణంగా అక్కడ ఏనుగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి వాటితోపాటు కరోనా పరీక్షలు కూడా చేస్తుండడం విశేషం. రాజస్థాన్‌లోని హాథీ గావోన్ వికాస్ సమితి, ఆ రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏనుగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.
కాగా జైపూర్‌లో ఉన్న ఏనుగులు టూరిస్టులకు స్వారీని అందిస్తుంటాయి. అవి అక్కడ అందుకు చాలా ఫేమస్. వాటి కోసం ప్రత్యేకంగా సంరక్షకులు ఉంటారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని సంరక్షిస్తున్నారు. అక్కడ టూరిస్టు ఏనుగులపై ఆధారపడి సుమారుగా 8వేల వరకు కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. కరోనా నేపథ్యంలో 10 నుంచి 15 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ సంరక్షకులు వాటిని రక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాటి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను టెస్టు చేస్తున్నారని, వాటి ఫలితాలు వచ్చేందుకు మరో 7 నుంచి 10 రోజుల సమయం పడుతుందని అక్కడి వెటర్నరీ డాక్టర్లు తెలిపారు.