దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిజానికి తగ్గుతుందని భావించిన కొవిడ్ వైరస్ అనూహ్యం గా లాక్‌డౌన్ సడలింపుతో దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా కేసులు రోజు రోజుకుభారీ ఎత్తున పెరుగుతు న్నాయి. అదేసమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. మార్చి 22 తర్వాత దేశంలో దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా లాక్‌డౌన్ విధించారు. దశవారీగా దీనిని పెంచుతూ పోయారు. తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావొచ్చు.. లేదా.. ఆర్థిక పరిస్థితి నానాటికీ సన్నగిల్లుతున్న పరిస్థితి కావొచ్చు.. మొత్తంగా ఈ నెల 1 నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ను సడలించారు. దీంతో కరోనా వ్యాప్తి భారీగా పెరిగిపోయింది.
మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిసా.. ఇలా అనేక రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోయాయి. అయి తే, కేసులతో పాటు.. మరణాలు కూడా పెరిగిపోవడం ఇప్పుడు ప్రధానంగా కలచివేస్తోన్న పరిణామం. తెలం గాణనే తీసుకుంటే.. ఒకప్పుడు ఏపీ సహా పక్క రాష్ట్రాల కన్నా చాలా తక్కవమరణాలు చోటు చేసుకున్నాయి. కానీ, ఇప్పుడు 200లకు చేరువలో మరణాలు చేరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం.. దాదాపు నెల రోజుల పాటు అసలు పరీక్షలే నిర్వహించకుండా మానేయడమని వైద్యులు ఇప్పుడు చెబుతున్నారు. దీంతో రోగ లక్షణాలు ముదిరిపోయి.. ప్రజలు మృత్యువాత పడుతున్నారు.
ఏపీ విషయానికి వస్తే.. మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు కూడా భారీగానే ఉంది. ఇప్పటి వరకు 80 మంది మృతి చెందితే.. పక్కరాష్ట్రం తెలంగాణలో 165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు రెండు వేల పైచిలుకు మంది ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో జాతీయ స్తాయిలో ఏపీ విషయం చర్చకు వచ్చింది. ఏపీలో ఒకప్పటి పరిస్థితికి ఇప్పటికి ఎందుకు తేడా ఉందనే విషయం చర్చకువచ్చింది.
ఏపీలో ఆది నుంచి కూడా ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించారు. అదేసమయంలో పరీక్షలను కూడా పెంచారు. ఇది ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోందని అంటున్నారు. ఏ చిన్న అనారోగ్యం ఉన్నప్పటికీ.. వెంటనే చికిత్స ప్రారంభించిన ఫలితంగా ఏపీలో రికవరీ రేటు పెరిగిందని కేంద్రం కూడా గుర్తించింది. మొత్తంగా రేపో మాపో.. ఏపీ ఫార్ములాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.