మరో రెండు నెలల్లో ఖాలీ కానున్న రాజ్యసభ పదవులకు నాయకులను ఎంపిక చేసే పనిలో పడ్డారట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం 151గా ఉంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. అయితే ఆయన వైసీపీకే మద్దతు తెలుపుతుండటంతో వైసీపీకి 152 మంది సంఖ్యా బలం ఉండనుంది. ఫిబ్రవరిలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఖాయగా కనిపిస్తోంది.
ఎన్నికలకు మరో రెండు నెలల సమయం ఉన్నా జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఇప్పటికే పదవులకు నాయకుల ఎంపికను పూర్తి చేసినట్లుగా వైసీపీ వర్గాల్లో అభిప్రాయపం వ్యక్తమవుతోంది. ఇందులో గతంలో హామీ ఇచ్చిన నాయకులకే పెద్ద పీట వేయనున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ పదవుల రేసులో అందరికంటే ముందుగా అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. రాంకీ అధినేతగా సుపరిచితులైన రామిరెడ్డి 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేసి మోదుగుల చేతిలో పరాజయం పాలయ్యారు. పార్టీ విధేయుడిగా పనిచేస్తుండటంతో ఆయనకు రాజ్యసభ సీటును జగన్ ఖరారు చేసినట్లు చర్చ జరుగుతోంది.
అలాగే జగన్ బంధువైన వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన జగన్మోహన్‌రెడ్డి రాజ్యసభ పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చారట. ఆ హామీ మేరకు ఇప్పుడు ఆయన ఎంపిక ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇక వైసీపీలో నెంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటున్న నెల్లూరుజిల్లాకు చెందిన మస్తాన్‌రావు వినబడుతోంది. విజయసాయిరెడ్డి, మస్తాన్‌రావు బాల్య మిత్రులు. మస్తాన్‌రావును ఎంపిక చేయడంతో నెల్లూరు ఓ వర్గం ప్రజలకు న్యాయం చేసినట్లుగా చెప్పడానికి అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నారట.
ఇక నాలుగో సీటు.. గోకరాజు రంగరాజు లేదా గంగరాజుకు కేటాయించేలా కనిపిస్తోంది. ఇటీవల గంగరాజు సోదరులతోపాటు ఆయన తనయుడు రంగరాజు వైసీపీలో చేరారు. గంగరాజు మాత్రం ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కూడా పార్టీలోకి తీసుకురావడానికి రాజ్యసభ పదవిని ఆశగా చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గంగరాజు పార్టీలో చేరితే ఆయనకు, లేదా ఆయన తనయుడు రంగరాజుకు రాజ్యసభ సీటిస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి. ఏం జరుగుతుందో… ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్న వేళ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో నాయకుల్లో అసమ్మతి చెలరేగే అవకాశం ఉందని కూడా రాజకీయవిశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.