రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర వివాదాస్పందంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై తల్లిదండ్రులు, వివక్షాలు ఆందోళనలు చేసినా అనుకున్నంతగా ప్రభుత్వం స్పందించలేదు. అయితే ఈ విషయమై బీజేపీ రాష్ట్రశాఖ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. దీంతో రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి నివేదిక కోరుతూ కేంద్ర హోం శాఖ ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ రాసింది. ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో పలు సాంకేతిక, మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితంగా పలువురు విద్యార్థులు తప్పడం, కొందరికి మార్కులు తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర నేతలు జులై 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ఇంటర్ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని వివరించారు.
ఆయా విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. 27 మంది విద్యార్థుల పూర్తి వివరాలను భాజపా నేతలు తాజాగా రాష్ట్రపతికి పంపించారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ ఏ విధంగా నివేదికను రూపొందిస్తుందోననది అందరూ వేచి చూస్తున్నారు.
– కేశవ