ఎన్నిసార్లు తామిద్దరం మంచి స్నేహితులమే అని చెప్పినా, రెబల్‌స్టార్ ప్రభాస్ – అనుష్కల ప్రేమాయణం గురించి పుకార్లు మాత్రం ఆగడంలేదు. ఇది ఇప్పుడు మరోస్థాయికి చేరిందని జాతీయ మీడియా గుసగుసలు.
రెబల్‌స్టార్ ప్రభాస్ – ఆరడుగల అందంతో ఇట్టే మగువల మనసులను చుట్టుముడుతున్న బాహుబలి. అనుష్క – అద్భుతమైన అందంతో మెరిసిపోయే జవ్వని. ఈ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుందని సగటు తెలుగు ప్రేక్షకుల గట్టి నమ్మకం.
ఆ మాటకొస్తే, ఇప్పుడు బాలీవుడ్ కూడా పై అభిప్రాయమే వ్యక్తం చేస్తోంది. ‘బాహుబలి’ మేనియా దేశదేశాలను ఒక ఊపు ఊపేసినందుకు, ఈ జంట అందులో అద్భుతమైన కెమిస్ట్రీ పండించినందుకు, ఎవరూ కూడా వీరిని వేరే వారితో చూడాలంటే కొంచెం ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం. తెలుగు అభిమానులైతే ఇక వారిని అన్నావదినలుగానే చూస్తున్నారు. వారిద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోందని, హైదరాబాద్‌లోని ప్రభాస్ ఫాంహౌస్‌లోనే వారు సహజీవనం చేస్తున్నారని పుంఖాలుపుంఖాలుగా పుకార్లు వెల్లువెత్తాయి. అయితే, వారిని ఇదే విషయం ఎప్పుడడిగినా, మా మధ్య అలాంటిదేమీలేదు. మేం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని కొట్టిపడేస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటులు కృష్ణంరాజు ఇక మావాడికి ఈ ఏడాది పెళ్లి చేస్తామని చాలా యేళ్లనుంచీ చెబుతూ వస్తున్నారు కానీ, అదేమీ వర్కవుట్ అవుతున్నట్లు లేదు.
అయితే, ఇప్పుడు విషయం పీక్ స్టేజకి వెళ్లిందని ఓ వార్త. ప్రభాస్ – అనుష్కలు తాము నివసించబోయే ‘ప్రేమ్‌నగర్’ను అమెరికాలోని లాస్ఏంజిలస్లో ప్లాన్ చేసారట. ‘ముంబయి మిర్రర్’ కథనం ప్రకారం, లాస్ఏంజిలస్లో తాము ఉండటానికి ఓ అద్భుతమైన భవంతిని వెతికేపనిలో ఈ ఇద్దరూ ఉన్నారట. వీరి ఆప్తమిత్రులు సైతం ఇంటికోసం లాస్ఏంజిలస్ను జల్లెడ పడుతున్నట్లు వినికిడి. ప్రస్తుతానికి పెళ్లి విషయమైతే ఏమీ మాట్లాడటంలేదు కానీ, అమెరికాలో ఇల్లు మాత్రం కొనాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు ఆ పత్రిక కథనం. దీంతో వారి ప్రేమ మరో మెట్టు ఎక్కనుందని అన్ని వుడ్‌ల అభిప్రాయం. గత కొంతకాలంగా విడిగా ఉన్న ఈ జంట మళ్లీ ఈ మధ్య కలిసిపోయిందని కూడా సదరు పత్రిక తెలిపింది.
ప్రస్తుతం ప్రభాస్ తన కొత్త చిత్రం ‘సాహో’ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అనుష్క కూడా తన సినిమా ‘నిశ్శబ్దం’ పనుల్లో తలమునకలుగా ఉంది. కొంచెం తీరిక చేసుకున్న ప్రభాస్ ఈ మధ్యే తన ప్రియసఖికి ‘సాహో’ ప్రత్యేకంగా ప్రదర్శించాడట. అందులో ప్రభాస్ అందానికి, నటనకు ఎంతో ముగ్ధురాలైనట్టు, పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు ప్రభాస్ మిత్రబృందం నుంచి సమాచారం.
– చంద్రకిరణ్